లాక్‌డౌన్ ముగిసిన 2 వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షల షెడ్యూలును త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ తయారు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి సురేశ్... ఈ విషయాలను వెల్లడించారు.
భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రికి వివరించారు. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అయినందున డిజిటల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్రమంత్రి సూచించినట్లు చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసి విస్తరించినట్లు కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని 9, 10 తరగతి విద్యార్థులకు ఇస్తున్నట్లు గుర్తు చేశామన్నారు. ఈ పథకానికి కేంద్రం నుంచి మరింత సహకారం ఇవ్వాలని కోరామన్నారు.