TDP focus on Gudiwada : గుడివాడలో టీడీపీ పరిస్థితి మారుతోంది. ఇప్పటివరకు గ్రూప్ తగాదాలతో సతమతమైన పార్టీ.. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతలంతా ఏకమయ్యారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకుడు వెనిగండ్ల రాము కృషి చేసినట్లు అక్కడి పరిస్థితులను చూస్తే కనిపిస్తోంది. చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశానికి ఒకే వేదికను జిల్లా నేతలంతా కలిసి పంచుకోవటం గుడివాడ రాజకీయాలకు శుభపరిణామమనే చెప్పాలి.
2014 తర్వాత ఇప్పటివరకు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు కలిసి ఒకే వేదికను పంచుకోవడం చూసింది లేదు. ఇరువర్గాల మధ్య రోజురోజుకు గ్యాప్ పెరుగుతూ వచ్చింది. గత సవంత్సరం చంద్రబాబు పర్యటన రద్దయిన సమయంలోనూ రావి, పిన్నమనేనిలు ఎడముఖం పెడముఖంతోనే వున్నారు. గత ఏడాది చివర్లో గుడివాడ రాజకీయాల్లోకి ఎన్నారై, టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగైదు నెలల్లోనే సేవా కార్యక్రమాలతో గుడివాడ నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 13న చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది.
ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించటానికి జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలంతా గుడివాడలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వెనిగండ్ల రాముకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా.. అయన ఎంతో సంయమనంతో వ్యవహరించారని చెప్పవచ్చు. ఎంతో ధైర్యంగా పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. గుడివాడ పర్యటనపై వెనిగండ్ల రాము ఇచ్చిన క్లారిటీతో 13 వ తేదీ రాత్రికి బస చేసి, 14న గుడివాడలోనే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు అంగీకరించారు. చంద్రబాబు పర్యటనలో అందరం కలిసి పాల్గొంటామని వెనిగండ్ల రాము చెప్పారు. అందరమూ కలిసికట్టుగా ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొడతామని స్పష్టం చేశారు.
అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని కొనకళ్ల విమర్శించారు. జగన్ పాలనలోని అన్యాయాలను ప్రజలకు వివరించేందుకే.. చంద్రబాబు జిల్లా పర్యటన చేస్తున్నారన్నారు.
చంద్రబాబు పర్యటన వివరాలు : ఈ నెల 12న మచిలీపట్నంలోని టిడ్కో ఇళ్లను చంద్రబాబు పరిశీలన తర్వాత ఖాలేకాన్‌పేట నుంచి రోడ్‌షో ప్రారంభం అవుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం హిందూ కళాశాల ప్రాంగణంలో బహిరంగ సమావేశం ఉంటుందని వివరించారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా నిమ్మకూరు చేరుకుని అక్కడే రాత్రికి బస చేస్తారని తెలిపారు. మరుసరి రోజు ఉదయం నిమ్మకూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారని ప్రకటించారు. సాయంత్రం 3 గంటలకు బయలు దేరి రోడ్‌షో ద్వారా పామర్రు మీదుగా గుడివాడ చేరుకుంటారన్నారు. వీకేఆర్, వీఎన్‌బీ కళాశాల ప్రాంతంలో బహిరంగ సభ ఉంటుందని, ఆ రాత్రి గుడివాడలో బస చేస్తారని.. 14న ఉదయం గుడివాడలో నిర్వహించే అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొని అక్కడి నుంచి నూజివీడుకు వెళ్తారని ప్రకటించారు.
జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం : జగన్ రాష్ట్ర భవిష్యత్తు కాదని.. రాష్ట్రానికి పట్టిన దరిద్రమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా విడిపోయిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనేందుకు వస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా జిల్లాలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం అయిందని తెలిపారు. గన్నవరంలోని ఇండస్ట్రియల్ పార్కు, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలను నేడు రివర్స్ టెండరింగ్ పేరుతో దీనావస్థకు చేర్చారన్నారు.
మాజీ మంత్రి, మాజీ ఎంపీ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాగంటి బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు నల్లగట్ల స్వామిదాస్, రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, పిన్నమనేని బాబ్జి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనిగండ్ల రాములా ఎప్పుడో ప్రయత్నించి ఉంటే గుడివాడ టీడీపీలో గ్రూపు తగాదాలు అప్పుడే సమసిపోయి ఉండేవని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవీ చదవండి :