Chandrababu was angry with the government : పేదల్ని మోసగించే ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం ఆర్5 జోన్ ఏర్పాటు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులకు, పేదలకు మధ్య గొడవలు సృష్టించే కుట్రకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారని ఆయన మండిపడ్డారు. సీఆర్డీఏ బృహత్ ప్రణాళికలోనే 5 శాతం భూమిని పేదల గృహ నిర్మాణానికి రిజర్వ్ చేయటంతో పాటు, 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీ వ్యూహ కమిటీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిణామాలపై చర్చించారు. ఆర్ 5 జోన్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలు, వివేకా హత్య తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం... ఆర్ 5 జోన్ పేరుతో పేదల్ని వంచించటమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తూ రెండు వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. సీఆర్డీఏ బృహత్ ప్రణాళికలో పేదలకు 5 శాతం భూమిని కేటాయించినప్పుడు రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని గుర్తు చేశారు. ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూరేలా తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.
ప్రజా ధనం దోచి పెడుతున్నారు.. వివేకా హత్య కేసు చూసే న్యాయవాదులకే ప్రభుత్వ సంబంధిత కేసులు అప్పగించటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. వివేకా హత్య కేసు నిందితుల తరఫున వాదించే న్యాయవాదులకు ప్రభుత్వ కేసులు అప్పగిస్తూ వారికి ప్రజాధనం దోచిపెడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉల్లంఘనలకు పాల్పడిన అధికారుల తరఫున వాదించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నా.. ప్రైవేటు న్యాయవాదులకు కేసులు అప్పగించి ప్రజా ధనాన్ని ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారనే అంశంపైనా సమావేశంలో కీలక చర్చ జరిగింది.
ప్రభుత్వం చేసే తప్పులకు ప్రజా ధనాన్ని ఫీజుల రూపంలో ప్రైవేటు న్యాయవాదులకు ఎలా చెల్లిస్తారని చంద్రబాబు నిలదీశారు. ఆర్ 5 జోన్ వ్యవహారంలోనూ పేదల్ని వంచిస్తూ అధిక మొత్తంలో ప్రజా ధనాన్ని ఫీజుల రూపంలో న్యాయవాదులకు చెల్లిస్తున్నారని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వేసవిలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటంతోనే రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు వేసవి తాపానికి అల్లాడాల్సి వస్తోందని వారు మండిపడ్డారు.
ఇవీ చదవండి :