కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన ఉప్పల ప్రసాదరావు అనే రైతు.. ఆదర్శ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. సరికొత్త సాగు పద్దతులను నిరంతరం వెతుకుతూ.. తాను సాధించిన అనుభవాన్ని తోటి రైతులతో పంచుకుంటున్నాడు. చదువు మీద పెద్దగా ఆసక్తి లేక తండ్రికి ఉన్న రెండు ఎకరాల పొలంలో సాగు మొదలు పెట్టాడు. దానికి తోడుగా రెండు గేదెలు. ఒకప్పుడు వీటితోనే వ్యవసాయంలోకి అడుగుపెట్టాడు ప్రసాదరావు. అప్పులు దొరకని పరిస్థితి నుంచి ఎదురీది.. సరికొత్త సాగు విధానాలను ఆవిష్కరిస్తూ.. పశు సంపదపై దృష్టి పెట్టాడు. సమీకృత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25 ఏళ్లు కష్టపడ్డాడు.
విత్తనాభివృద్ధి క్షేత్రంలో శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ.. కొత్త వంగడాలు సేకరించటం.., కొత్త వ్యవసాయ పద్ధతలు అవలంబిస్తూ లాభాల బాటలో పయనించాడు. సేంద్రియ వ్యవసాయం తోపాటు.. వరి సాగులో ఖర్చులు తగ్గించుకోవటం.., నీటి కొరత వచ్చినపుడు.. వెద పద్ధతిలో సాగు చేయటం వంటి విధానాలతో ముందుకెళ్తున్నాడు. దీంతో రెండు ఎకరాలతో ప్రారంభమైన ప్రసాదరావు వ్యవసాయ ప్రస్థానం.. ఎనిమిది ఎకరాల పొలంతో పాటుగా వంద ఎకరాల కౌలు సాగుకు చేరింది. రెండు గేదెల నుంచి 250 పశువుల పెంపకంగా మార్చుకున్నాడు. 50కి పైగా బ్లాక్ బెంగాల్ మేకలు, 100 కోళ్ళతో సమీకృత సాగంటే ఇదీ అన్నట్లుగా.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నారు.
ప్రసాద రావు చేస్తున్న కృషిని తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఫోన్ చేసి అతడు చేస్తున్న వ్యవసాయ విధానాలను తెలుసుకున్నారు. ఖర్చులు తగ్గించుకొని, ఎక్కువ దిగుబడి పొందే వెద పద్దతులపై ఆరా తీశారు. తాను చేసే వ్యవసాయ విధానాలపై సీఎం కేసీఆర్ ఆసక్తి కనబరిచారన్న ప్రసాదరావు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు వ్యవసాయం చేయటంతోపాటు పశుసంవర్ధకం, మేక, పౌల్ట్రీ పెంపకంపై దృష్టి పెట్టాలని ప్రసాదరావు సూచిస్తున్నాడు. అందువల్ల రైతులకు ఆర్థికంగా ఇబ్బందులుండవని చెబుతున్నాడు. ఒకరైతు సాధించిన అభివృద్ధి మార్గం.. ఎంతో మంది రైతులకు బంగారుబాట కావాలంటే.. ఆ రైతు చేస్తున్న కృషిని గుర్తించడంలోనే ఉందంటున్నాడు. రైతుల సాధకబాధకాలను ఏలికలు గుర్తించి, వారిని ప్రోత్సహిస్తే.. అన్నదాతల ఆనందానికి మార్గం సుగమం అవుతుందని ఈ ఆదర్శ రైతు నొక్కివక్కాణిస్తున్నాడు.
ఇవీ చూడండి...