కొత్త ప్రభుత్వం విడుదల చేసిన సచివాలయాల సిబ్బంది నోటిఫికేషన్‌కు.. భారీ స్పందన వస్తోంది. ఉద్యోగం సాధించాలనే తపనతో లక్షల అభ్యర్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. వీటిలో డిగ్రీ విద్యార్హత ఉన్న పోస్టులకు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తుండగా... కేటగిరి 2 కింద భర్తీ చేస్తున్న టెక్నికల్ పోస్టులకు మాత్రం పోటీ అంతగా కనిపించడంలేదు.
వీరే అర్హులు
గ్రామ, వార్డు సచివాలయాల నోటిఫికేషన్‌లోని కేటగిరి 2 గ్రూప్ ఏ, గ్రూప్ బి విభాగాలను టెక్నికల్ పోస్టులను భర్తీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ విభాగంలో 11 వేల 158 ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి... సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లామా లేదా విశ్వవిద్యాలయం నుంచి సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. వార్డు సచివాలయాల్లో ఈ విభాగానికి 3 వేల 601 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ విభాగ అర్హత పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగంలో 50 మార్కులు, సివిల్, మెకానికల్ సబ్జెక్టులకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. కేటగిరి 2 విభాగంలోని పోస్టులకు సివిల్, మెకానికల్ డిప్లామా, ఇంజినీరింగ్ అర్హత ఉన్న వారు మాత్రమే అర్హులు కావడం వల్ల... పోటీ కాస్త తక్కువగా ఉంది.
సర్టిఫికెట్ తప్పనిసరి
కేటగిరి 2లో గ్రూప్ బి కింద గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో, విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రెండు పోస్టులకు పదోతరగతి అర్హతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలనే నిబంధన ఉంది. విలేజ్ సర్వేయర్ పోస్టులకు సంబంధించి సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమా, బీటెక్ చదివిన వాళ్లు లేదా లైన్సెస్డ్ సర్వేయర్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు అర్హులుగా నోటిఫికేషన్లో నిర్దేశించారు.
కోర్ సబ్జెక్టుపై పట్టుంటే ఉద్యోగం మీదే
గ్రూప్ బిలో 2 వేల 880 వీఆర్వో, 11 వేల 158 విలేజ్ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టులు ఎక్కువగా ఉన్నా.... నియామకానికి సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు ఉన్నవాళ్లు తక్కువగా ఉండడం వలన ఈ పోస్టులకు సైతం పోటీ పెద్దగా లేనట్లే. అభ్యర్థులు కోర్ సబ్జెక్టుల మీద శ్రద్ధ పెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఈ విభాగంలో ఉద్యోగం సాధించడం కష్టం కాదంటున్నారు నిపుణులు.
కేటగిరి 1 తో పోలిస్తే కేటగిరి 2లో ఉన్న పోస్టులకు దరఖాస్తులు తక్కువగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. కామన్ పేపర్‌తో పాటు కోర్ సబ్జెక్టులపై అభ్యర్థులు దృష్టి సారిస్తే జీవితానికి భరోసానిచ్చే సర్కారీ కొలువు సాధించినట్లే.
ఇదీ చదవండి : ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!