ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఓట్లు తొలగించాలని ఫారం-7ను తామే దరఖాస్తు చేస్తున్నామన్న జగన్ ప్రకటనతో వివాదం మరింత ముదిరింది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా జిల్లా యంత్రాంగానికి అభ్యర్థిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌కు మంత్రి దేవినేని ఉమ బృందం ఫిర్యాదు చేసింది.
తెలంగాణలో ఎన్నికల ముందు తొలగించిన ఓట్లపై రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 24 లక్షల ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేస్తే అక్కడి అధికారులు క్షమాపణ చెప్పి వదిలేశారన్నారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. జగన్ వంటి అవినీతిపరుడు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. ఓటు తొలగించే హక్కు వైకాపాకు ఎక్కడిదని ప్రశ్నించారు. తెదేపా సానుభూతిపరుల ఓట్లు తొలగించి దుర్బుద్ధితో జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని విమర్శించారు.ఓట్ల తొలగింపు కుట్రకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఇవీ చదవండి...