MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అడ్డదారులు తొక్కుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న స్థానిక సంస్థల అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అభ్యర్థులను బలపరిచిన వారిని పోలీసులే మాయం చేయడం ఒక్క జగన్ పాలనలోనే చూస్తున్నామని మండిపడ్డారు.
కిడ్నాప్ చేసి వేధింపులు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరిచినందుకు కడపలో ముగ్గురు, డోన్‌లో నలుగురిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన బోన్ చెరువుపల్లి ఎంపీటీసీ ఆలా శేఖర్, బేతంచర్ల కౌన్సిలర్లు పూజారి రామాంజనేయులు, నంద్యాల మధు, గోపాల్‌ను పోలీసులు వేధించడం అప్రజాస్వామికమన్నారు. నిన్న అర్ధరాత్రి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇంతవరకూ వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కిడ్నాప్‌నకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.., రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్ర చేసి గెలవాలని అధికార పార్టీ చూస్తోందని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల్లో ఆందోళన పుట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసిన అభ్యర్థుల వివరాలను ఆన్ లైన్లో ఉంచాలి కానీ ఇక్కడ అధికారులు మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థుల వివరాలను నమోదు చేయలేదని చెప్పారు. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీకి వత్తాసు పలికేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థులుకు మద్దతుగా అధికారులు వంతపాడటంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. నిబంధనలు విరుద్ధంగా ఉంటే నామినేషన్ తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయం తెలుస్తుంది కాబట్టి అధికారులు వైఎస్సార్సీపీ నాయకుల పత్రాలు ఆన్ లైన్ లో దాఖలు చేయలేదు. వీటన్నిటిపైన కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
సంతకాలు సరిగా లేవనే సాకుతో... అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగానే తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రంగయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు మంగమ్మ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ముందు నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే నామినేషన్ చివరి రోజున యాడికి మండలానికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ రంగయ్య.. స్థానిక సంస్థల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారు. అయితే రంగయ్య దాఖలు చేసిన నామినేషన్‌ను సంతకాలు సరిగా లేవని అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. ఈ వివరాలతో కూడిన పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిని రంగయ్య తీవ్రంగా ఖండించారు.
నాకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా నామినేషన్‌ను తిరస్కరించారు. ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకులు కుట్రతో ఇలా చేశారు. అన్ని అడ్డంకులను దాటుకొని నామినేషన్ వేశాను. తిరస్కరణపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాను. - రంగయ్య, స్వతంత్ర అభ్యర్థి
ఇవీ చదవండి :