రాజధానికి లక్ష కోట్లు ఎందుకని ప్రశ్నించిన సీఎం జగన్, వైకాపా నాయకులు.. ఇప్పుడు అదే రాజధాని పేరిట రూ.50 వేల కోట్ల అప్పుల కోసం బయలుదేరారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులకోసం ప్రయత్నిస్తుండడమే ఇందుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
బీసీ జనగణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి.. రేపు కేంద్రం ప్రశ్నిస్తే "తూ..చ్ మేం చేయలేదని బుకాయించినా ఆశ్చర్యంలేదు"అని తెదేపా అధికారప్రతినిధి నాగుల్ మీరా(TDP spokesperson Nagul Meera comments) ఎద్దేవా చేశారు. బీసీలకు రాజకీయ ప్రాబల్యం కల్పించి, వారిని నాయకుల్నిచేసింది స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడేనని అన్నారు. బీసీలకు పదవులిచ్చానంటున్న ముఖ్యమంత్రి.. వారిపై పెత్తనాన్ని మాత్రం తన వర్గానికే అప్పగించాడని దుయ్యబట్టారు. ప్రజలను దారుణంగా వంచిస్తూ, దోచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలంటూ వారిని విభజించి పాలించాలనుకుంటున్నాడని ఆక్షేపించారు.
అసెంబ్లీలో మహిళలను కించపర్చేలా మాట్లాడిన వారిని పదవుల నుంచి భర్తరప్ చేయకుండా.. భద్రత పెంచటం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. వైకాపా ఆవిర్బావం తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యయని దుయ్యబట్టారు. తాలిబన్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లుగా.. బూతుల సంసృతిని జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఉన్న గన్ మెన్లను తొలగించి.. బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలకు అదనంగా గన్ మెన్లను కేటాయిస్తారా? అని నిలదీశారు. బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ జగన్ సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: BC Census: ఆ తీర్మానం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కీలక ఘట్టం: ఎంపీ మోపిదేవి