TDP Pattabhi on APSSDC : ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుపై నాడు జీవోలు ఇచ్చిన అధికారి నీలం సహానిని పిలిచి అడిగితే సీఐడీకి కావాల్సిన సమాధానాలు దొరుకుతాయని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుకు కావాల్సిన నిధులను మంజూరు చేసిన నాటి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా వ్యవహరించిన అజేయ కల్లంను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలైన నీలం సహాని సెప్టెంబర్ 10వ తేదీ 2014 న జీవో నంబర్ 47 ను విడుదల చేసి ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజనానంతరం ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించేందుకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే సంస్థ అవసరమని ఆమె జీవోలో పేర్కొన్నారని వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ.. 2014 అక్టోబర్ 7 న సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ జీవోలు, డాక్యుమెంట్లకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నియమనిబంధనలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు జరిగిందనడానికి ఇవి సాక్ష్యాలు కావా అని ప్రశ్నించారు. ఈ డాక్యుమెంట్లు తప్పని రుజువు చేసే దమ్ము సీఐడీకి, ప్రభుత్వానికి ఉందా అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహానీ జీవో ఇచ్చారు. అదే విధంగా ఎండీ, సీఈవోను అపాయింట్ చేస్తూ జీవో ఇచ్చారు. అప్పట్లో నీలం సహాని జీవో ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు అజయ్ కల్లాం ఇచ్చారు. కానీ, వారిని విచారణకు పిలవకపోవడం ఏంటి. రాష్ట్ర విభజనానంతరం ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించేందుకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే సంస్థ అవసరమని జీవోలో స్పష్టంగా తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్... ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ.. 2014 అక్టోబర్ 7 న సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రభుత్వం వాస్తవాలు ఎంత దాచినా మేం ప్రజల్లోకి వెళ్తాం. వాస్తవాలను ప్రచారం చేస్తాం. పచ్చి అబద్దాలతో విష ప్రచారం చేసినా.. మేం ధైర్యంగా ప్రజలముందుకు వెళ్తాం. అక్రమంగా చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టి కక్ష తీర్చుకోవడం దారుణం. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఏపీలో యువత నైపుణ్యాల పెంపునకు తీసుకున్న చర్యలు.. చంద్రబాబు నాయుడు దార్శనికతను చాటుతున్నాయి. ప్రభుత్వం బురద జల్లడం సరికాదు. - కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధి