రాష్ట్ర విభజన సమయంలో వైకాపా అధికారంలో ఉండి ఉంటే.. వెల్లకిలా పడేవారేమోనని తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఎద్దేవాచేశారు. ఇప్పుడు ఉన్న పెండింగ్ బిల్లులనే సునామీ అనడం వైకాపా చేతకాని తనమని విమర్శించారు. మండలిలో మంత్రి పిల్లిసుభాష్‌చంద్రబోస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాల పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమేనన్నారు. ఇప్పుడే వైకాపా ప్రభుత్వం కొత్తగా చేసినట్లు చెప్పడం గొప్పేమీకాదన్నారు. తెదేపా హయాంలో రాష్ట్ర బడ్జెట్ను 1,11,823 కోట్ల నుంచి 2,27,975కోట్లకు పెంచామన్న టీడీ జనార్ధన్.. ఐదేళ్లలో మొత్తం బడ్జెట్ 1,16, 152 కోట్లు అదనంగా పెంచామని గుర్తుచేశారు. నాలుగు రెట్లకంటే ఎక్కువ మూలధన వ్యయం చేశామన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, సిమెంట్ రోడ్లు, ఇళ్లు పెద్దఎత్తున నిర్మించామన్నారు. తెదేపా హయాంలో ఏడాదికి సగటున 26వేల కోట్లు అప్పులు చేస్తే .. వైకాపా ప్రభుత్వం ఏడాదిలోనే 87 వేల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. ఇంత అప్పు చేసి... ఏ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క రోడ్డు వేయలేదని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే.. వైకాపా వైఫల్యాలను తెదేపాపై నెట్టి తప్పించుకోవాలని చూస్తోందని టీడీ జనార్దన్ అన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణ: సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ అంత్యక్రియలు