అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిలో భాగంగా... తెదేపా నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారు. ముందు జాగ్రత్తగా తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహనిర్భందం చేశారు. ఎన్ని అరెస్ట్లు చేసినా అసెంబ్లీ ముట్టడి జరిగి తీరుతుందని ప్రత్తిపాటి హెచ్చరించారు.
- శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నాయకుడు కూన రవికుమార్‌తో మాజీ ఎమ్మెల్యేలు రమణమూర్తి, వెంకటరమణమూర్తిలను గృహ నిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 35 కేసుల్లో 314 మంది తెదేపా నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
- తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, అనంతలక్ష్మి, మేయర్ పావనిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
- విజయవాడ ఆటోనగర్ వద్ద మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను తాడేపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తెదేపా నేతల గృహనిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కళా వెంకట్రావు పేర్కొన్నారు. పోలీసు చర్యలతో ప్రజాఉద్యమాన్ని ఆపలేరని... ఇది ప్రభుత్వ పిరికపంద చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. తక్షణమే నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోమవారం మండలి సమావేశాలు లేవంటూ పలువురు ఎమ్మెల్సీలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మండలి సమావేశాలకు వెళ్లడంపై పోలీసులు ఎలా నిర్దేశిస్తారని సభ్యులు మండిపడ్డారు. 13 జిల్లాల్లో తెదేపా నేతలను ఎందుకు నిర్బంధిస్తున్నారని లోకేశ్ ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. రాజధాని విభజన నిర్ణయం అద్భుతమని వైకాపా నేతలు డప్పు కొడుతున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి