కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళనలకు తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు.. పార్టీ నేతలను బయటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి.. దాడిచేసిన వారిపై చర్యలు చేపట్టకుండా పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఈ పరిణామానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
దేవినేని ఉమను పరామర్శించేందుకు వెళుతున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును ఆయన ఇంటి వద్దే అడ్డుకుని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నందిగామలో గాంధీ సెంటర్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. సౌమ్య, తెదేపా కార్యకర్తలతో... పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను వారు ప్రవ్నించారు.
దేవినేని ఉమకి మద్దతుగా నందివాడ బయలుదేరిన తెలుగుదేశం ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్‌ని ఉయ్యూరు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. తమ నాయకుడికి మద్దతుగా వెళ్తుంటే అన్యాయంగా అరెస్టు చెయ్యడం అప్రజాస్వామికమని రాజేంద్రప్రసాద్ ఆగ్రహించారు. ఉమా కారుపై రాళ్ల దాడిని, అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. "మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం దారుణం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మీరు చేసే దౌర్జన్యాలు, దమన కాండలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే మీకు తగిన బుద్ది చెబుతారన్నారు.
ఇదీ చదవండి:
దేవినేనిపై హత్యాయత్నం కేసుతో చంద్రబాబు ఆగ్రహం.. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం
case filed on Devineni: దేవినేనిపై.. అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద కేసు నమోదు