జగన్ ప్రభుత్వం ఎస్సీలకు ఒక్క మేలు కూడా చేయలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. గత ప్రభుత్వం అమలుచేసిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యాపథకాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఎస్సీ విద్యార్థులకు కేటాయిస్తే.. జగన్ ప్రభుత్వం వాటిని నిలిపేసిందని అన్నారు.
ఎస్సీలకు రాజ్యాంగపరంగా సంక్రమించే వాటినీ.. నవరత్నాల పేరుతో తామే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ప్రభుత్వం 40వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం సబ్ ప్లానే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలు, హత్యలు, అక్రమ కేసులు, దాడులు ఎస్సీలకు కానుకగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్.రాజు మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ నుంచి ఎస్సీ మెజిస్ట్రేట్ రామకృష్ణ వరకు వైకాపా ప్రభుత్వం ఎస్సీలను అణచివేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులు వైకాపా గూండాల్లా వ్యవహరించి వరప్రసాద్ కు శిరోముండనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఎస్సీలు తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: రెండు సంస్థలకు విద్యుత్ టారిఫ్లను తగ్గించిన ప్రభుత్వం