YSRCP Social Media Activists in Varra Ravinder Reddy Case : వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41-A నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారంట్ జారీ చేశారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వైఎస్‌ఆర్ జిల్లాలోని పలువురు ఆ పార్టీ కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున పులివెందుల, కడప ప్రాంతాల్లో ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలైన ఆరుగురి ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు. పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి 41A నోటీసు అంటించి వచ్చారు. ఆ సమయంలో వివేకానందరెడ్డి ఇంట్లో లేకపోవడం.. ఆయన భార్యకు సమాచారం ఇచ్చి నోటీసు అంటించి వచ్చారు.
శనివారం ఉదయం 10 గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ వివేకానందరెడ్డి విచారణకు వెళ్లలేదు. ఇతనితోపాటు జిల్లా కో కన్వీనర్లు సునీత, నిషాంత్, వర కుమార్ తోపాటు మరో ఇద్దరి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించగా ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీ న్యాయవాదులు, బాధిత కుటుంబ సభ్యులు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ను కలిసి విచారించాలనుకుంటున్న వారి జాబితా అందజేస్తే తామే పోలీసుల ముందు హాజరుపరుస్తామని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ
వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆయన భార్య కల్యాణి ఆరోపించారు. తన భర్త పేరుతో భూషణ్ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కడప కోర్టులో వేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ఇంకా విచారణకు రాకముందే.. పోలీసులు అతడికి సర్చ్ వారంట్ జారీ చేశారు. లింగాల మండలం అంబకపల్లెలోని అతడి ఇంటికి సర్చ్ వారంట్ నోటీసు అంటించారు. ఈ పరిణామాలతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. ఎపుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
వైఎస్సార్సీపీ 'సోషల్' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు