అన్నదాతను అడుక్కుతినే స్థాయికి దిగజార్చుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కృష్ణా జిల్లా మోపిదేవి తెదేపా నాయకులు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా 33 వేల ఎకరాలను రాష్ట్రానికి ఇచ్చిన అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. న్యాయస్థానం - దేవస్థానం పాదయాత్ర చేపట్టిన అమరావతి రైతులకు మద్దతుగా మోపిదేవి మండలంలో రైతులతో కలిసి తెదేపా నాయకులు చేపట్టిన భిక్షాటకు విశేష స్పందన లభించింది.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చిన్నారులు, చిరు వ్యాపారులతో పాటు గుడిముందు ఉండే యాచకులు సైతం తమ వంతు సహాయం చేసి మద్దతు తెలిపారు. ఈ విధంగా వచ్చిన రూ.50,455 అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులకు అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి మద్దతుదారులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని అందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మూడు రాజధానుల మాట విడనాడి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Maha Padayathra: అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..