వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను సీఎం జగన్ వెనక్కు తీసుకోవడం పట్ల మతలబు ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. రిట్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆనాడు జగన్ కోరారని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే అంతఃపుర రహస్యాలు బయటకు వస్తాయని ఎద్దేవా చేశారు. వివేకా గురించి పిటిషన్ వేసిన సునీత, సౌభాగ్యమ్మలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ ఉందా..? అని ధ్వజమెత్తారు. బాబాయిని చంపిన నిందితులను చట్టానికి పట్టివ్వాలని జగన్‌కు లేదని విమర్శించారు.
మీ ఇద్దరి రహస్య మంతనాలేంటి...?
ఉత్తరప్రదేశ్ రాజ్యసభసభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు అమరావతిలో పని ఏంటని వర్ల రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌తో భాజపా సభ్యులు లేకుండా.. ఒంటరిగా కలవడం పట్ల మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్ణయ కమిటీలో జీవీఎల్ నరసింహరావు కూడా ఉన్నాడని గుర్తు చేశారు. భాజపా అంతా రాజధానికి మద్దతు తెలుపుతుంటే... జీవీఎల్ మాత్రం ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: