రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 40 మంది వరకు చనిపోతే ప్రభుత్వం 11 మంది మాత్రమే చనిపోయినట్లు అవాస్తవాలు ప్రకటించిందని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తాము సేకరించిన వివరాల ప్రకారం 29 మంది చనిపోయిన వారి పేర్లు లభించాయని.. మరో 15 మంది వరకు మరణించారనే సమాచారం స్థానికుల ద్వారా అందుతోందని తెలిపారు. అసలు ప్రభుత్వ లెక్కలకు వాస్తవాలకు ఎక్కడ పొంతన లేదని మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..
రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి.. అసలు వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని అన్నారు. రుయాలో ఆక్సిజన్ సరఫరా ఐదు నిమిషాలు మాత్రమే నిలిచిపోయిందన్నది అవాస్తవమని ఆయన విమర్శించారు. ఘటనకు 4-5 రోజుల ముందు నుంచే ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు తలెత్తుతుంటే అధికారులు ఎందుకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైందని చెబుతున్న ఆక్సిజన్ వాహనాన్ని జీపీఎస్ ద్వారా ఎందుకు ట్రాక్ చేయలేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రీన్ ఛానల్ రవాణా ఎందుకు ఏర్పాటుచేయలేదని ఆయన నిలదీశారు.
ఇదీ చదవండి: