కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి వ్యవహారంలో పోలీసులు సరిగా స్పందించలేదని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. ఘటనా జరిగి 24 గంటలు దాటినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ సంఘటనపై మీడియాకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు దాచారని పోలీసులను నిలదీశారు. దాడి విషయం తెలుసుకున్న ఉమా.. కొండపల్లిలో బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇకనైనా దుండగులను కాపాడటం మాని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లైంగిక దాడి జరిగిందని బాలుడి కుటుంబీకులు ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయకపోగా.. రాత్రింతా కంట్రొల్ రూంలో ఉంచి, ఇవాళ తెల్లవారుజామున గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారని విమర్శించారు. జాతీయ రహదారిపై ఉన్న కొండపల్లిలో ఇలాంటి ఘటన బయటకు రాలేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. మీడియా గొంతును ఎంతగా అణిచివేస్తున్నారో తెలుస్తోందన్నారు.
జీజీహెచ్‌లో బాలుడిని పరామర్శించిన దేవినేని
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలుడిని దేవినేని ఉమ పరామర్శించారు. అతని పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగితే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఘటనను ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి..