స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా సాకు చూపిస్తున్న ప్రభుత్వం... మద్యం దుకాణాలు, పాఠశాలలు ఎలా తెరిచిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు... కేవలం తెదేపా హయాంలో నిర్మించారనే అక్కసుతో 2 లక్షల 62 వేల మందికి ఇళ్లు అప్పగించకుండా ముఖ్యమంత్రి జగన్ వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 15 వందల కోట్ల రూపాయల బకాయిలు సైతం నిలిపేశారని మండిపడ్డారు. 17 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు.
సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్ధిదారులను తామే ఇళ్లలో దించుతామని హెచ్చరించారు. అలాగే ఇళ్ల పట్టాల కింద ఇచ్చే సెంటుకి అదనంగా మరో సెంటు భూమి ఇవ్వాలన్నవి ప్రధాన డిమాండ్లుగా 'నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి' అనే నినాదంతో పోరాటానికి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు ఈ ఉద్యమాన్ని నడుపుతామని చెప్పారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని చైతన్య పరిచే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: