TDP demands a CBI inquiry into the kidnapping of Visakha MP's family : విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ పై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ విజయవాడలో బుద్దా వెంకన్న, తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా నిరసన చేపట్టారు. సీఎం జగన్ అవినీతిని విశాఖలో అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంలో ఆ పార్టీ నేతల పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. వాటాల్లో, లాభాల్లో తేడా వచ్చినందుకే ఆ పార్టీ పెద్దల కనుసన్నల్లోనే ఎంపీ కుటుంబం కిడ్నాపునకు గురైందని ఆక్షేపించారు.
వైఎస్సార్సీపీ నేతలను చూసి విశాఖపట్నం ప్రజలు బెంబేలెత్తుతున్నారని వాపోయారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా తక్షణమే ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం, విశాఖలో జరిగిన భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలన ఎప్పుడు అంతం అవుతుందా అని విశాఖ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు. రాజధాని పేరుతో విశాఖలో భూ దోపిడీకి వైఎస్సార్సీపీ పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టబట్టారు.
గంజాయి విక్రయాలు అరికట్టాలని... రాష్ట్రంలో గంజాయి విక్రయాలు అరికట్టాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య, తెలుగు యువత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గంజాయి విక్రయాలను నిరసిస్తూ తాడేపల్లిలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నేతలు ర్యాలీ నిర్వహించారు. గంజాయి విక్రయాలు అరికట్టలేని సీఎం రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెరుకుపల్లిలో అమర్నాథ్ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అంబేడ్కర్ కూడలి వద్దకు రాగానే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు... ర్యాలీగా వచ్చిన వారిని బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన తెలుగు యువత నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
బాలుడి హత్యపై టీడీపీ ఆందోళన... బాపట్ల జిల్లాలో పదో తరగతి బాలుడిని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి చంపిన రౌడీలను ఎన్కౌంటర్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ బీసీ సెల్ నాయకులు నినాదాలు చేశారు. తన సొంత అక్కను వైఎస్సార్సీపీ రౌడీలు ర్యాగింగ్ చేస్తే అడ్డుకున్నందుకు బాలుడని చూడకుండా గంజాయి మత్తులో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నా కనీసం మంత్రులు, ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం దారుణం అని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కే విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోలా వ్యవహరిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. బీసీలు ఏకమై ఈ ప్రభుత్వానికి చమర గీతం పాడాలని పిలుపునిచ్చారు. అమర్నాథ్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.