ఉప్పుటేరు వెంట కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 30 గ్రామాల వరకు ఉన్నాయి. 50వేల వరకు జనాభా ఉంటుంది. కైకలూరు, కలిదిండి మండలాల పరిధిలో ఉప్పుటేరు, పెదలంక డ్రెయిన్ సముద్రంలో కలవడం, సముద్రపు నీరు ఆటుపోట్ల సమయంలో ఏరుల్లో కలవడం వల్ల... ఈ ప్రాంతంలో ఉప్పుశాతం గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాలూ ఉప్పుమయంగా మారాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన కొల్లేటి నీటితో అలరారే ఈ ప్రాంతం... ఇప్పుడు ఉప్పుతీరంగా మారింది.
తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణమదే...
విభజన తరువాత ఆర్థిక భారాన్ని తలకెత్తుకున్న రాష్ట్ర ఖజానాకు... కలిదిండి మండలం దన్నుగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఆక్వారంగమే. అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న ఈ రంగమే... ఇక్కడ తాగునీటి ఎద్దడికి ప్రధాన కారణమవుతోంది. రొయ్యలు, చేపల చెరువులు పెరగడంతో... భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారాయి. కైకలూరు, కలిదిండి, కృత్తివెన్ను మండలాల్లో ఉప్పుటేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లో తాగునీటి చెరువులు లేవు. చుట్టూ నీరున్నా తాగడానికి పనికిరావు. నేతలు, అధికారులు తమని బ్రతికున్న మనుషులుగా గుర్తించడం లేదంటూ... మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనలకే పరిమితమైన ప్రతిపాదనలు...
2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వంలో... మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలాన్ని ఉప్పు మండలంగా ప్రభుత్వం గుర్తించిందని ప్రకటించారు. 20 గ్రామాలకు తాగునీరు అందించే దిశగా రూ.80 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. కలిదిండి మండలం తాడినాడలో రూ.13 కోట్ల అంచనాతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిద్వారా 11గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఐ.భీమవరంలోని వెంకయ్య వయ్యేరు కాల్వనుంచి ఈ గ్రామాలకు నీరందించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
గొంతు తడవాలంటే ఏరు దాటాల్సిందే...
తాడినాడ శివారు సున్నంపూడి, పోతుమర్రు పరిధిలోని దుంపలకోడుదిబ్బ, చినతాడినాడ, విభ్రాంపురం గ్రామాల మహిళలు ఉప్పుటేరులో నాటు పడవపై బిందెలతో వెళ్లి... పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుపాడు, కమతావానిపాలెం, మందపాడు గ్రామాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. 20అడుగులకుపైగా లోతున్న ఉప్పుటేరులో ప్రయాణం ప్రమాదమని తెలిసినా... గొంతు తడవాలంటే ఏరు దాటాల్సిందేనని ఆ గ్రామస్థులు దీనస్వరంతో చెబుతున్నారు. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి కనీసం తారునీరు అందించాలని తీరప్రాంత గ్రామస్థులు కోరుతున్నారు.