విజయవాడ నుంచి గుడివాడ వెళ్లే రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. కోమటిగుంట లాక్ దగ్గర నుంచి.. ఈ రోడ్డు మొత్తం ప్రమాదాలకు నెలవుగా మారింది. రెండు వైపులా కాలువలు ఉండటం.. నాణ్యతా లోపం వంటి కారణాలు వాహనదారులకు శాపంగా మారాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. నిత్యం పనుల కోసం వెళ్లేవారు, సాధారణ ప్రయాణికులు.. రోడ్డుగుండా వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ఈ రహదారి మీదుగానే ప్రయాణిస్తున్నా.. రోడ్డు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, రాత్రి వేళల్లో అయితే.. ప్రయాణాలు పెను గండాలుగా పరిణమిస్తున్నాయని, అతి వేగంతో వెళ్లే వాహనాలు ఏవైపు నుంచి వచ్చి ఢీకొడతాయోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది. వారానికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుడివాడ సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఇలాంటి మార్గంలో ప్రయాణించాలంటే.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోందని వాహనదారులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి: