రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది విద్యార్థులు చైనా వెళ్లి వచ్చినప్పటికీ, వైరస్ రాకుండా చర్యలు చేపట్టినట్లు వివరించింది. రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ఇప్పటికే ఏర్పాటు చేశామని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు వివరించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 29 మంది ప్రయాణికులపై నిఘా పెట్టామని, వీరిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవని వైద్యులు ధృవీకరించినట్లు సర్కారు వెల్లడించింది.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్ని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. 28 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్కుల కోసం సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని తెలిపింది. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు.... అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం 0866-2410-978 నంబరుతో పాటు, 1100, 1902 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్ : చైనా నుంచి స్వస్థలానికి విజయనగరం వాసులు