నందిగామలో నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించి కాలక్రమంలో మున్నేరు వాగు భూగర్భంలో కలిసి పోయి.. ఇటీవలే వరదల్లో వెలుగుచూసిన శ్రీ విజ్ఞాన నందీశ్వర మహాలింగ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మున్నేరు వాగు ఒడ్డున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారు. వేదపండితులు, అర్చకులు పూజారులు శాస్త్రోక్తంగా, సాంప్రదాయం ప్రకారం మహాలింగాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. దంపతులు సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి ఆవు,దూడను పూజారులు వదిలారు.
ఆలయ అభివృద్ధి ఖర్చులు నేనే భరిస్తా: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు భక్తులు సమకూర్చిన విరాళాలు పోను మిగిలిన మొత్తం తానే భరిస్తానని తెలిపారు. ఆలయ నిర్మాణంతోపాటు మున్నేరు వాగు వద్ద వరకు.. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండ పటిష్ఠంగా నిర్మాణాలు చేయాలన్నారు. దీనికి తన వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ