farmers facing problems with snakes: కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పాములు.. రైతులు, కూలీలను బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు.. పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోవడంతో పనులకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. ఈ ప్రాంతంలో త్రాచుపాము, నాగుపాము, రక్త పింజరి, కట్ల పాము, కాటువేసే పాముల్లో ముఖ్యమైనవి. పాము కరిచినట్లు గుర్తించడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం పట్ల అశ్రద్ధ వహిస్తే.. ప్రాణాలమీదికి వస్తుందని వైద్యులంటున్నారు.
జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సుమారు లక్షా యాభై వేల ఎకరాల అయుకట్టులో వరి కోతలు సాగుతున్నాయి. వరి కట్టివేత, కుప్ప వేసే సమయంలో రైతులు, కూలీలను పాములు కాటు వేస్తున్నాయి. ఈ ఏడాది సుమారు పది మంది వరకు పాముకాట్లతో మృత్యువాత పడ్డారు. పాము కరిచిన వారిని ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు పోతున్నాయని, దగ్గర్లో వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
దివిసీమలో పాము కాట్ల వల్ల మరణాలు పెరిగిపోవడంతో రైతులు, కూలీలు పంటలు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. కొన్నిచోట్ల కూలీలు రాని పరిస్థితుల్లో.. రైతులు తమ బంధువులతో పొలం పనులు చేయించుకుంటున్నారు. పాము కాటు వైద్యాన్ని ఆయా గ్రామాల్లోని సచివాలయాలల్లో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: