కృష్ణా జిల్లాలో సోమవారం వేర్వేరుచోట్ల జరిగిన నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాడ పడ్డారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బాపులపాడు మండలం, కంచికచర్ల, విజయవాడలో అజిత్‌సింగ్ నగర్, కృష్ణలంక పరిధిల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
- బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారందరూ భీమవరంలో ఓ వివాహానికి హాజరై నూజివీడు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- హైదరాబాద్-విజయవాడ రహదారిలో కంచికచర్ల వద్ద అడిషనల్ డీజీపీ కృపానంద త్రిపాఠి వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రిపాఠికి ప్రమాదం తప్పింది.
- విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
- విజయవాడ కృష్ణలంక బస్టాండు రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను లారీ ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణలంక రణధీర్ నగర్‌కు చెందిన వినోద్, శేఖర్లుగా గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదాలకు వేగమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి