SIT to arrest MLAs poaching case accused: తెలంగాణలో 'ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్‌ల దిశగా అడుగులు వేస్తోంది. నలుగురు అనుమానితుల్లో ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. నలుగురు అనుమానితుల్లో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్ తుషార్ ఇప్పటివరకు సిట్ ముందుకు రాలేదు. వీరిలో సంతోష్ తర్వాత హాజరవుతానని సిట్‌కు సమాచారం ఇవ్వగా.. మిగిలిన ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకుండాపోయింది. దీన్నిబట్టి సంతోష్ కొంత సమయం కోరి విచారణకు హాజరవుతారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తాము సేకరించిన సమాచారాన్ని సంతోష్ చెప్పే సమాధానాలతో పోల్చుకొని తదుపరి చర్యలకు దిగనుంది.
MLAs poaching case latest update : జగ్గుస్వామిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.. తాజాగా తుషార్‌పైనా జారీ చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన కేసులో జగ్గుస్వామి పాత్ర కీలకం కాగా అతడు కర్ణాటకలోని షిమోగాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు దొరికితే కేసును మలుపుతిప్పే ఆధారాలు లభిస్తాయనే అంచనాతో ఉన్నారు.
రెండో రోజూ శ్రీనివాస్ విచారణ: నిందితుడు సింహయాజితో సంబంధాలు కలిగి ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌ను సిట్ వరుసగా రెండోరోజూ విచారించింది. తొలిరోజు సుదీర్ఘంగా దాదాపు ఎనిమిది గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్న శ్రీనివాస్.. మంగళవారం సుమారు ఏడు గంటలపాటు విచారణ ఎదుర్కొన్నారు. నందకుమార్‌తో సంబంధాలపై రెండోరోజు ఆరా తీశారు. బుధవారం కూడా శ్రీనివాస్‌ను విచారణకు రావాలని సిట్ చెప్పినట్లు సమాచారం. బీజేపీకి, తనకి సంబంధం లేదని న్యాయవాది శ్రీనివాస్ అన్నారు. సింహయాజి పీఠాధిపతి కాబట్టి హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ బుక్ చేయమంటే చేశానని చెప్పారు. కేవలం ఆ టికెట్ కోసమే నన్ను అడుగుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఎరకు సంబంధించి నాకు సంబంధమున్నట్లు పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఆధారం చూపించలేదన్నారు. విచారణకు మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు.
నిందితుల కస్టడీకి పిటిషన్: నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళవారం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఇప్పటికే పదిహేను రోజులు గడిచినందున పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దంటూ నిందితుల తరపున కౌంటర్ దాఖలైంది. న్యాయస్థానం బుధవారం విచారణను నిర్వహించనుంది.
ఇవీ చదవండి: