తొలితరం చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీ సీనియర్ భాగస్వామి, పలు సంస్థలకు డైరక్టర్‌గా వ్యవహరించిన దేవినేని సీతారామయ్య కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కిందటి ఆదివారం అపోలో ఆస్పత్రిలో చేరిన దేవినేని సీతారామయ్య.. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు అపోలో ఆస్పత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సీతారామయ్యకు కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో వైద్యుడు.. కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. దేవినేని సీతారామయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామం. కంకిపాడు మండలం పునాదిపాడులో సీతారామయ్య పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. గుంటూరులో బీకాం, సీఏ పూర్తి చేసిన సీతారామయ్య అనేక ఉన్నత పదవుల్లో కొనసాగారు. తితిదే ఛైర్మన్‌గా, హెరిటేజ్ ఫుడ్ ఛైర్మన్‌గా, బాచుపల్లి విజ్ఞానజ్యోతి చారిటీ సంస్థ వ్యవస్థాపక కోశాధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ డైరెక్టర్‌గా, రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. దుండిగల్ సేవా ఆశ్రమం వృద్ధాశ్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు. పలు కంపెనీలకు ఛైర్మన్‌గా, డైరెక్టర్‌గా పని చేశారు. ధార్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారు.
చంద్రబాబు సంతాపం
దేవినేని సీతారామయ్య మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సీతారామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్టీఆర్‌కు దేవినేని సీతారామయ్య అత్యంత సన్నిహితులని తెలిపిన చంద్రబాబు.. తితిదే ఛైర్మన్‌గా సీతారామయ్య అందించిన సేవలను కొనియాడారు.
సీతారామయ్య తన మెుదటి గురువు అని నారా లోకేశ్ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. సీతారామయ్య మృతి పట్ల తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కళా గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: