రైతు భరోసా రెండో విడత కింద 2 వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ వీటిని విడుదల చేస్తారని తెలిపారు. 50 లక్షల మంది రైతులకు 1,114 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ కింద పట్టాలు పొందిన గిరిజన రైతులకు 11,500 వేల రూపాయలు అందుతాయని వివరించారు. అక్టోబరులో పడిన వర్షాలకు లక్షా 70 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కన్నబాబు పేర్కొన్నారు. వరదనష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని చెప్పారు.
పోలవరం ఈ దుస్థితికి కారణం తెదేపానే
పోలవరానికి పూర్తి స్థాయి నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పటానికి కారణం తెదేపానే అని మంత్రి కన్నబాబు ఆరోపించారు. 2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తాము కడతామని కేంద్రం చెబితే... లేదు రాష్ట్రమే చేపడతామని చెప్పి వారి చేతుల నుంచి లాక్కున్నారని గుర్తు చేశారు. అందుకే కేంద్రం ఇప్పుడు కప్పదాటు మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం ఆమోదించిన మొత్తాన్ని అయినా చెల్లించాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి