వ్యాధుల సీజన్(Seasonal Diseases) ఇప్పుడే మొదలైంది. వర్షాలు కురుస్తుండడంతో జబ్బులు కూడా ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా కలుషిత నీరు, ఆహారం వల్ల టైఫాయిడ్, జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు(డయేరియా) వంటివి ప్రబలుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లాలో టైఫాయిడ్, జిగట, నీళ్ల విరేచనాలు అధికంగా ప్రబలగా.. హైదరాబాద్‌లో డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయి.
అసలు సీజన్(Seasonal Diseases) ముందుండడంతో.. అప్రమత్తంగా వ్యవహరించకపోతే, కాలానుగుణ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఇటీవల వైద్యఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించి, జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
ఎందుకు ప్రమాదం?
కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్లే క్రమంలో కలుషితమవడానికి అవకాశాలెక్కువ. అందులోనూ వరద కారణంగా తాగునీటి పైపులైన్లలో లీకేజీ ఏర్పడి కలుషితానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో తాగునీటి ట్యాంకులను బాగా కడుక్కోకపోతే అపరిశుభ్రతకు దారితీస్తుంది. అలాగే ఈ కాలంలో తినేపదార్థాలపై ఈగలు ముసురుకుంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తాగునీరు, ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆహారాన్ని తీసుకోవడం, స్వచ్ఛమైన నీటిని తాగడం మేలని చెబుతున్నారు. మరోవైపు గత ఐదేళ్లతో పోల్చినప్పుడు కలుషిత నీటి వల్ల వ్యాపించే వ్యాధులు గణనీయంగా తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో స్పష్టంచేసింది. నివేదికలో కొన్ని జిల్లాల్లో ‘0’ కేసులుగా పేర్కొన్నా.. వాస్తవానికి ఆయా జిల్లాల నుంచి కచ్చితమైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి వ్యాధుల సమాచారాన్ని కచ్చితంగా పొందుపర్చాలని ఆ శాఖ ఆదేశాలు జారీచేసింది.
స్వీయ జాగ్రత్తలు కొనసాగించాలి
కొవిడ్ కారణంగా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక ముందూ ఇదే ఒరవడి కొనసాగించాల్సిన అవసరముంది. కలుషిత నీటి వల్ల ప్రబలే వ్యాధుల(Seasonal Diseases)ను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేను కొనసాగించాల్సిందిగా ఆదేశాలిచ్చాం. ప్రజలు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. శుభ్రమైన నీటిని తాగడానికి ప్రాధాన్యమివ్వాలి.
- శ్రీనివాసరావు, డీహెచ్
- ఇదీ చదవండి : తీవ్ర వ్యాయామాలతో సమానం.. గుండెకు మేలు!