రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. ప్రభుత్వం జూలై 1,3,4 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ( వైఎస్ఆర్ - జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ) లపై జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయి అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 1,3,4 తేదీల్లో మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో 4,846 మంది లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ముఖ్యమంత్రి నిర్ధేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా పెద్దఎత్తున ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో వైకాపా యువనాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్, వైకాపా జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు తన్నీరు నాగేశ్వరరావు, జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ తహసీల్దార్లు రామకృష్ణ, ఉదయ భాస్కర్, చంద్రశేఖర్, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్ , డీఈఈ విద్యుత్ శాఖ ఏడీలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Lokesh On Jagan: "అంతరాత్మతో మాట్లాడండి.. నిరుద్యోగులకు న్యాయం చేయండి"