తన విచక్షణ అధికారంతో 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉద్దేశించిన అభివృద్ది వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న విచక్షణ మేరకు నిబంధనల ప్రకారమే అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసన సభ, శాసన మండలిలో ప్రవేశపెట్టామని తెలిపారు. గతంలో ప్రవేశపెట్టిన బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని.. ఈ విషయాన్ని శాసన మండలి ఛైర్మన్ స్పష్టం చేశారని తెలిపారు.
పద్దతి ప్రకారం రెండో సారి బిల్లు పెట్టినా.. వీటిని అడ్డుకునేందుకు తెదేపా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా తెదేపా ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తెదేపా అధినేత చంద్రబాబు తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని రాజధానులైనా ఉండొచ్చనీ.. ఒకటే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని అన్నారు. తెదేపా నేతలు వారి బినామీలను రక్షించుకునేందుకే డ్రామాలకు తెరలేపారని ఆక్షేపించారు. అమరావతి ఆందోళన పేరిట కొద్దిమంది ఆర్గనైజ్ చేసి.. టెంటు వేసి ఆందోళనలు నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని... ఇది తప్పక అమలు జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు