కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పాటెంపాడు సమీపంలో గుర్రాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపులపాడు మండలం ఆరుగొలనులో హరిజనవాడ వీధులు చెరువులను తలపిస్తున్నాయి.
పెనుగంచిప్రోలు మండలంలో అనిగండ్లపాడు, శివాపురం, లింగగూడెం, పెనుగంచిప్రోలు, ముళ్లపాడు గ్రామాల మధ్య ఉన్న వాగులు పొంగిపొర్లాయి. భారీ వరద రావడంతో వంతెనపై నుంచి నీరు పారింది. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. అనిగండ్లపాడు, ముచ్చింతల, లింగగూడెం, గుమ్మడిదుర్రు గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.
నందిగామ మండలం మాగల్లు వద్ద దండి వాగు పొంగుతోంది. నందిగామ మధిర ఆర్అండ్బీ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో వరి పొలాలు మునిగాయి. జాతీయ రహదారిపై అనాసాగరం వద్ద వర్షం నీరు నిలిచి వాహనచోదకులు అసౌకర్యానికి గురవుతున్నారు.
మునగచెర్ల వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
విజయవాడ అజిత్సింగ్ నగర్, ఎల్బీఎస్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోవటంతో ఆ ప్రాంతాలలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సబ్యులు చిగురుపాటి బాబురావు పర్యటించారు. స్ధానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల వాసులకి శాశ్వత పరిష్కారం చూపలేకపోవటం దారుణమని బాబు రావు విమర్శించారు.