తెలంగాణ రాష్ట్రంలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి. నిబంధనల సడలింపుతో రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించి విధులకు హాజరవుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తూ...
కార్యాలయంలోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకుంటున్నారు. కార్యాలయాల్లో భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరం నిమిత్తం వచ్చే వారు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలను దూరంగా సర్దుబాటు చేశారు.
జాగ్రత్తలు పాటించేలా చూస్తూ..
భూములు, భవనాలు రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి వచ్చే వారు మాస్క్ ధరించి ఉంటేనే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తరువాతనే...తదుపరి ప్రక్రియను మొదలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారు.. మాస్క్ బదులు టవల్‌ను మూతికి అడ్డం కట్టుకునైనా రావాలని స్పష్టం చేస్తున్నారు.
ఆన్లైన్లో స్లాట్ బుకింగ్
రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో రద్దీని పూర్తి స్థాయిలో దూరం చేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు... ముందు ఆన్‌లైన్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కేటాయించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్తున్నారు. కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి అవసరం లేకుండా పోయింది.
10 రోజుల్లో 46వేల డాక్యుమెంట్లు
గత పది రోజుల్లో 46,195 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో 23 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని చేసుకున్నారని వెల్లడించారు ఆ శాఖ అధికారులు. క్రమంగా స్లాట్ బుక్ చేసుకునే విధానానికి అలవాటు పడుతున్నారని వారు తెలిపారు.
రూ.281 కోట్ల 65 లక్షల ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల యాభై రోజుల తరువాత ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 21వ తేదీ వరకు 46,195 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.129.79 కోట్లు, ఈ- స్టాంపుల విక్రయాల ద్వారా మరో 151.86 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. మొత్తం 281 కోట్ల 65లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చింది.
ఆదాయం ఆశాజనకం
సాధారణ రోజుల్లో రోజుకు 25 నుంచి 30 కోట్లు వరకు రాబడి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ పది రోజుల్లో వచ్చిన రాబడిని బేరీజు వేస్తే... లాక్‌డౌన్ సమయంలోనూ రోజుకు 28 కోట్లకు పైగా ఆదాయం రావడం ఆశాజనకంగా ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదీచూడండి. 'వలస కూలీల తరలింపునకు ఏర్పాట్లు చేయండి'