Vehicle Finance: దైవదర్శనానికి వచ్చిన ఓ వాహనదారుడికి రికవరీ ఏజెంట్ల వేధింపులు తప్పలేదు. కిస్తీలు చెల్లించలేదని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగచెర్ల మండలానికి చెందిన రాజేశ్.. ఖమ్మంలోని ఫైనాన్స్ కంపెనీ ద్వారా టాటా ఏస్ వాహనాన్ని కొన్నారు. ఇప్పటికే ఐదు కిస్తీలు కట్టగా మరికొన్ని కట్టాల్సిఉంది. రాజేశ్ కుటుంబ సభ్యులు, బంధువులతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి దర్శనానికి వచ్చిన విషయం తెలుసుకున్న వసూళ్ల ఏజెంట్లు అక్కడే వాహనం స్వాధీనం చేసుకున్నారు.
కిస్తీలు కడితేనే వాహనం ఇస్తామన్నారు. దైవదర్శనానికి వచ్చామని ఇంటికి వెళ్లగానే కిస్తీలు కడతామని చెప్పినా వినకుండా వాహనం తీసుకుపోతామని బెదిరించారు. చివరకు రాజేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు తమ వద్ద ఉన్న రూ.30 వేల నగదును ఏజెంట్లకు ముట్టజెప్పారు. మిగతా కిస్తీలను సకాలంలో చెల్లించాలని బాండ్ రాయించుకొని ఏజెంట్లు వెళ్ళిపోయారు.
ఇవీ చూడండి