రాష్ట్రంలోని నదులు , జలాశయాల్లో విహార యాత్రలకు, రవాణాకు వినియోగిస్తోన్న లాంఛీలు, పడవలు అత్యంత ప్రమాదకర పరిస్ధితుల్లో తిరుగుతున్నాయి. బోట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు, ఫిట్ నెస్ పరీక్షలు, తనిఖీ వరకు వ్యవస్థ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. ఏ బోటులోనూ సుశిక్షితులైన ఇంజినీర్లు, సరంగులు లేరు. ఏళ్ల తరబడి నడుపుతోన్న అనుభవంతో నెట్టు కొస్తున్న వారే అంతా.
ఈ ప్రమాదాలకు మూల కారణం ఏంటి?
మేరీటైమ్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మారిటైమ్ బోర్డు పోర్టుల డైరెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో మేరిటైం బోర్డుల్లో సర్వేయర్ బృందం, డిజైన్ అప్రైజల్ బృందం, సర్టిఫికేషన్ బృందం, రిజిస్ట్రేషన్ అథారిటీలు ఉంటాయి. ఇక్కడ అవేమీ లేకుండానే నామమాత్రపు సిబ్బందితో నడుపుతున్నారు. మేరిటైం బోర్డుకు తగిన సాధన సంపత్తి లేకపోవడంతో... రిజిస్ట్రేషన్ సమయంలో బోట్లను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో గుర్తించే బాధ్యత ఓ ప్రైవేటు నావల్ అర్కిటెక్ట్కు అప్పగించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బోట్లలోనూ నావల్ ఆర్కిటెక్ట్తోనే తనిఖీ చేస్తున్నారు. వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
బోటు డిజైన్లు ఎందుకు ఉపయోగపడతాయి?
ఒక బోటులో ఇంజిన్ ప్రొఫెల్లర్లు, స్టీరింగ్లు ఎక్కడ ఉంటాయి. ప్రయాణికులను ఎక్కడ కూర్చోబెడతారు. వంటి విషయాలన్నీ డిజైన్లో ఉంటాయి. దీనిని జనరల్ అరేంజ్ మెంట్ డ్రాయింగ్ అంటారు. ఇవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదా అని ఐఆర్ఎస్ విభాగం పరిశీలిస్తుంది. బోర్డు నిర్మాణం పూర్తయ్యాక దానికి స్టెబిలీటీ పరీక్ష నిర్వహిస్తారు. బోటులో ప్రయాణించే వారంతా ఏ పక్కకు వెళ్లినా బోటు మునగకుండా ఉండేలా చేస్తారు. వివిధ కోణాల్లో బోటు భద్రత పరీక్షించిన తర్వాతే అది నడిపేందుకు అనుకూలమో కాదో ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్(ఐఆర్ఎస్)నిర్వహిస్తుంది. ఈ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బోటు రిజిస్ట్రేషన్ చేయాలి.
మన రాష్ట్రంలో బోట్లు ఎలా డిజైన్ చేస్తున్నారో తెలుసా?
రాష్ట్రంలో ఏ బోటు డిజైన్లకు ఐఆర్ఎస్ అనుమతి తీసుకున్నట్లు కానీ.. స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. యజమాని తన అవసరాలు చెబితే దాని ప్రకారం బోటు నిర్మిస్తున్నారు. ప్రమాణాలు పాటించడం లేదు. రిజిస్టేషన్ ప్రక్రియ లోపాల పుట్టగా మారింది. బోట్ల రిజిస్ట్రేషన్ చేయాల్సింది మేరిటైమ్ బోర్డు అయినా ఆ ప్రక్రియ అంతా తూతూ మంత్రంగా జరుగుతోంది. మారిటైమ్ బోర్డు నియమించిన నావల్ ఆర్కిటెక్ట్ ధ్రువీకరణతో రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. రాష్ట్రంలో తిరుగుతోన్న ప్రతి బోటూ మెరిటైమ్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుందా.. అనేది అనుమానమేనని నిపుణులు చెబుతున్నారు.
అధికారులు ఈ నిర్లక్ష్యవైఖరి మానుకుని బోట్ల భద్రతపై కఠిన చర్యలు తీసుకోకుంటే దేవిపట్నం లాంటి బోటు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి