కృష్ణా జిల్లా గన్నవరం మండలం పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్ ఆసుపత్రిలో ఆర్డీవో భవానీ శంకర్ తనిఖీలు నిర్వహించారు. కరోనా బాధితులకు అందజేస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించి.. మరణాలు సంభవించకుండా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా తీవ్రత ఉన్న రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. వైద్య సేవల లోపం కారణంగా.. ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. కరోనా సోకితే చనిపోతామనే భావన ఉందనీ.. దీనివలనే రోగులు మానసిక స్థైరాన్ని కోల్పోతున్నారన్నారు. రోగుల్లో ఆత్మస్థైర్యం నింపాలని వైద్యులకు సూచించారు. బాధితులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్య చికిత్స ప్రారంభించాలని భవానీ శంకర్ స్పష్టం చేశారు. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు సూచించారు. వాడిన పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలు నిబంధనలను అనుసరించి కాల్చివేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: 'వ్యాధి సోకిన వారు 10 రోజులు కరోనా దీక్ష చేస్తే వైరస్ జయించొచ్చు'