ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అన్నదాతలతో దోబుచులాడుతున్నాయి. తొలకరి జల్లులతో పులకరించాల్సిన పుడమి తల్లి నోళ్లు తెరిచింది. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు మెట్ట, మాగాణి భూముల్లో దుక్కులు దున్ని పంటల సాగుకు అనుకూలంగా సిద్ధం చేశారు. అదునులో వర్షాలు పడి ఉంటే ఈపాటికి విత్తనాలు మొలకెత్తేవి. వరుణుడు ముఖం చాటేయడంతో విత్తు నాటేందుకు రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. అడపాదడపా వర్షాలు పడుతున్నా సాగునీటి అవసరాలు మాత్రం తీర్చడం లేదు.
భూమిలోనే మొలకలు
జిల్లాలో ఏటా ఈ సమయానికి వరినార్లు పోసి, పత్తి, పెసర, మినుము, కంది, వేరుసెనగ విత్తనాలు నాటడం పూర్తి చేసి నాట్లు వేసేందుకు మాగాణి భూములను దుక్కులు దున్ని సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యేవారు. అలాంటిది ఈ ఏడాది మాత్రం వ్యవసాయ పంపు సెట్ల కింద కొన్నిచోట్ల మాత్రమే వరి నారుపోశారు. వాగులు, చెరువులు, ఎన్‌ఎస్‌పీ కాలువల ఆయకట్టులో నారుమడులను సిద్ధం చేసి ఉంచారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న చోట పెసర, మినుము, కంది, కూరగాయ విత్తనాలు నాటగా, కొన్ని మండలాల్లో మొలకలు భూమిలోనే గిడసబారుతున్నాయి. వర్షాలు వెనుకాడితే మెట్ట, మాగాణి భూముల్లో ఆరుతడి, కూరగాయల పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికీ తక్కువ వర్షపాతమే
జిల్లాలో 50 మండలాలకు ఇప్పటి వరకు 30 మండలాల్లోనే సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన 20 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. జూన్ 1 నుంచి జులై 1 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 105.8 మి.మీ. కాగా ఇప్పటి వరకు 126.6 మి.మీ. నమోదైంది. కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దీన్ని సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, గంపలగూడెం, ఆగిరిపల్లి, బాపులపాడు, నందివాడ, పెదపారుపూడి, తోట్లవల్లూరు, కృత్తివెన్ను, పెనమలూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి, ముసునూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, కలిదిండి, బంటుమిల్లి, పామర్రు, ఘంటసాల మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం వరకు తక్కువగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా వ్యవసాయ పనులకు అవరోధంగా మారింది.
కళావిహీనంగా సాగునీటి వనరులు
పశ్చిమ కృష్ణాలోని కట్లేరు, తమ్మిలేరు, మునేరు, రామిలేరు, పడమటి, విప్ల, తూర్పు, పడమటి వంటి 12 వాగులు, 920 పైచిలుకు చెరువులు నీటి సవ్వడి లేక కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. తొలకరిలో కుండపోతగా వర్షాలు పడితే ఇప్పటికే వాగులు, చెరువుల్లోకి నీరు చేరి కళకళలాడుతూ కనిపించేవి. ఈ ఏడాది మాత్రం సరైన వర్షాలు కురవకపోవడంతో అడుగంటాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పలకరించినా కొన్ని మండలాల్లో చినుకు జాడ కరవైంది.
ఇప్పటికే పత్తి, పెసర, మినుము, కంది విత్తనాలు విత్తిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో తేమశాతం లేక మొలకలు రావడం లేదు. తిరిగి విత్తాల్సిన పరిస్థితి నెలకొంది. విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.900 నుంచి రూ.6 వేల వరకు ఉంది. ఎకరానికి మూడు ప్యాకెట్ల చొప్పున తిరిగి విత్తాలంటే పెట్టుబడుల భారం పెరగునుంది.
దుక్కులు సిద్ధం చేశాం..
మాగాణి భూముల్లో వరినాట్లు వేసేందుకు వీలుగా నారుమడులు దుక్కులు దున్ని సిద్ధం చేశాం. ఇప్పటి వరకు సరైన వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకంగా మారింది. నియోజకవర్గంలోని చెరువులు, వాగులు అడుగంటాయి. వరుణుడిపై భారం వేసి ఆశగా ఎదురు చూస్తున్నాం. - కె.సుబ్బారావు, రైతు, చింతలపాడు
వ్యవసాయ పనులు నిలిచాయి..
మెట్టభూములను వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేశాం. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు విత్తు నాటేందుకు వీలుగా మరోసారి దుక్కులు దున్ని శుభ్రం చేశాం. కొందరు రైతులు మాత్రం ధైర్యం చేసి పత్తి, పెసర, కంది, మినుము, వేరుసెనగ విత్తనాలు నాటారు. వర్షాలు వెనుకాడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ముమ్మరంగా సాగాల్సిన వ్యవసాయ పనులు నిలిచాయి. - ఎం.వెంకటేశ్వరరావు, జి.కొత్తూరు
ఇదీ చదవండి: Gas Cylinder: వంటింటి గ్యాస్ మంట.. ఒకేసారి రూ. 25.50 పెంపు