రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు 30 శాతం కూడా సాగవలేదు. ఇంతలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. గురువారం నుంచి కురిసిన భారీ, అతిభారీ వర్షాలతో పలుచోట్ల పంటలు మునకేశాయి. పత్తి, ఉల్లి, వరి నారుమళ్లతోపాటు ఉద్యాన పంటలు కూడా నీటమునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55 మండలాల్లో ముంపు ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పొలాల్లో నీరు బయటకుపోయే కొద్దీ నష్టం బయటపడుతోంది. పంట నష్టం సేకరణలో గ్రామాల్లోని వ్యవసాయ సిబ్బంది నిమగ్నమయ్యారు.
జూన్‌లో వర్షాలు అనుకూలించకపోవడంతో సాగు నెమ్మదించింది. జులైలో కురిసిన వానలతో ఇప్పుడిప్పుడే ఖరీఫ్ పనులు జోరందుకుంటున్నాయి. జులై మొదటి వారం నుంచి అధిక శాతం విస్తీర్ణంలో పత్తి వేశారు. మిరప, వరి నారుమళ్లు పోసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నాట్లు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉల్లి అధిక విస్తీర్ణంలో వేశారు. గురువారం నుంచి కురిసిన భారీ, అతిభారీ వర్షాలతో.. ఈ పొలాల్లోకి నీరు చేరింది. తేమ అధికంగా ఉండటంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తడం లేదు. వేల రూపాయలతో మళ్లీ విత్తనాలు కొనాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూత రాలుతున్న పత్తి!
కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాల్లో పత్తి ప్రస్తుతం పూత దశలో ఉంది. రెండు రోజుల వానలతో పూత రాలిపోతుందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల పత్తి చేలల్లో అడుగుల ఎత్తున నీరు నిలిచింది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మినుము పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉల్లి రైతుకు భారీ నష్టం
కర్నూలు జిల్లాలో భారీగా సాగైన ఉల్లిని వరద ముంచెత్తింది. రెండు రోజులపాటు నీరు నిల్వ ఉండటంతో మొక్కలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కొత్తపల్లి, బండిఆత్మకూరు, మహానంది, నంద్యాల, గోస్పాడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో ఈ జిల్లాలోనే ఉద్యాన పంటలకు సుమారు రూ.12 కోట్ల నష్టం తలెత్తినట్లు అంచనా వేస్తున్నారు.
నీటిలోకి వరి, నారుమళ్లు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో.. అక్కడి నుంచి వచ్చే వరద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను తాకింది. దీంతో పశ్చిమ కృష్ణాలో వరి నాట్లు, నారుమళ్లు మునకేశాయి. ముంపు నీరు ముందుకెళ్లే అవకాశం లేకపోవడంతో.. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులుగా వరి నారు మళ్లు నీటిలోనే నానుతున్నాయి. జులై రెండో వారంలో కురిసిన వర్షాలకు ఒకసారి నారుమళ్లు మునిగాయి. కొంతమేర నారు దెబ్బతింది. మళ్లీ విత్తనాలు కొనుక్కుని నారు పోస్తే.. ప్రస్తుత వర్షాలకు మళ్లీ దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మాగాణి, మెట్ట పంటలకు నష్టం కలుగుతోంది.
మురుగు ముందుకు కదలడం లేదు
అయిదెకరాల్లో వరి వేయడానికి 15 రోజుల కిందట నారు పోశాం. వర్షాలకు పూర్తిగా మునిగింది. మురుగు పూర్తిస్థాయిలో లాగకపోవడంతో.. నారు మడి నీటిలోనే నానుతోంది. ఎక్కువ రోజులు నీటిలో ఉండటంతో దెబ్బతింటుంది. మళ్లీ నారు పోయాలంటే ఖర్చుతోపాటు, నాట్లు ఆలస్యమవుతాయి. -కె.రమేశ్, కౌలు రైతు, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా
ఈ నెలలో రెండోసారి
జులై 7న నారు పోస్తే విత్తనాలు చల్లిన రెండు రోజులకే వానలు పడ్డాయి. దీంతో సగానికి పైగా దెబ్బతింది. మళ్లీ విత్తనాలు తెచ్చి 20న నారు పోశా. ఇంకోసారి మునిగింది. నీటిని తొలగించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. - గుత్తుల సూరిబాబు, కేశనకుర్రు, తూర్పుగోదావరి జిల్లా
ఇదీ చదవండి:
కార్గిల్ ప్రత్యేకం: మంచు శిఖరంపై మరపురాని విజయానికి 22 వసంతాలు