Sachivalayam employees: రెండేళ్ల సర్వీసు పూర్తయి.. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైనా దాదాపు 2,000 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను పక్కన పెట్టారు. ప్రత్యేకించి కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది ఉద్యోగులు ప్రొబేషన్‌కు నోచుకోలేదు. ప్రొబేషన్ ఖరారు విషయంలో గతంలో వీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.21 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
వారిలో 1.05 లక్షల మందికి తాజాగా ప్రొబేషన్ ఖరారు చేసినా 90,000 మందికే జులై నెలకు సంబంధించి పెరిగిన కొత్త వేతనాలు ఖాతాల్లో జమయ్యాయి. 15,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు మూల వేతనమే అందగా, దాదాపు 5,000 మంది జీతాల బిల్లులు సకాలంలో అప్‌లోడ్ కానందున కొత్త వేతనాలు అందలేదు. 2,000 మందికి ప్రొబేషన్ ఖరారు చేయకపోవడంతో పాత వేతనాలే జమ అయ్యాయి. అప్పట్లో నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో వీరిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
మిగిలిన 9,000 మందిలో శాఖాపరమైన పరీక్షలో పాస్‌కాని వారు, ఉత్తీర్ణులైనా ఇతర కారణాలతో ప్రొబేషన్ ఖరారు చేయని వారు, రెండేళ్ల సర్వీసు పూర్తవ్వని వారు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ మొదలయ్యాక.. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో ఆందోళనకు దిగిన ఉద్యోగుల పేర్లు జిల్లా కలెక్టర్లకు వెళ్లాయి. రెండేళ్ల సర్వీసు పూర్తయి, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రొబేషన్ ఖరారుకు అర్హత కలిగినా కలెక్టర్లు, అధికారులు వారిని పక్కన పెట్టారు.
నాడు జాప్యంపై నిరసనలు
2019 అక్టోబరులో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభమైంది. 2021 అక్టోబరుకు వారి రెండేళ్ల ప్రొబేషన్ కాలం పూర్తయింది. అప్పటికి దాదాపు 50వేల మంది శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వీరి ప్రొబేషన్ ఖరారు చేస్తే నవంబరు నుంచి కొత్త వేతనాలు అందుకునే అవకాశం ఉండేది. ఈ విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ ఏడాది జనవరిలో పలువురు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొందరు విధులు బహిష్కరించారు.
ఇవీ చదవండి: 'కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం.. అన్నివేళలా అండగా ఉంటా'