కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ సభ్య కార్యదర్శి, భారత బీమా రెగ్యులేటరీ అథార్టీ చీఫ్ జనరల్ మేనేజర్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని ప్రశ్నిస్తూ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు తోట సురేశ్‌బాబు హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఆసుపత్రుల వివరాల్ని అదనపు అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి