Patha Edlalanka village: కృష్ణాజిల్లా అవనిగడ్డ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతఎడ్లంక అనే గ్రామంలో 800 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఊళ్లో సుమారు 250 ఇళ్లు ఉంటాయి. గ్రామానికి ఒక వైపు కృష్ణానది, మరో వైపు చిన్నపాయతో చుట్టూ కృష్ణానది ప్రవహిస్తోంది. నది ఆటుపోట్లకు ఆ గ్రామంలోని ఉత్తర, పడమర దిక్కుల్లోని ప్రాంతం గత 30 ఏళ్ల నుంచి కోతకు గురవుతోంది. గత నెలలో కృష్ణా నదికి వస్తున్న వరదల ప్రభావంతో 500 మీటర్ల మేర గ్రామం...నదీ గర్భంలో కలసిపోయింది. నది ప్రక్కన ఉన్న ఇళ్లు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే 50 వరకు ఇళ్లు ఇలా మునిగిపోయాయి. వందలాది ఎకరాల పంట పొలాల పరిస్థితీ ఇదే.
"ఓట్లని అడుక్కుంటారేగానీ తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. వచ్చి చూసి వెళ్తారు అంతే.. ఫొటోలు తీసుకుని వెళ్తారు. మా కన్నీళ్లు తూడుస్తారా..?. మాది మూడెకరాల దొడ్డి. వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీపావళి వచ్చేలోపు వర్షాలు ఇలాగే పడితే ఇల్లు కూడా పడిపోతుంది. తాగడానికి మంచినీళ్లు కూడా లేవు. ఆ రేవులో నీళ్లే తోడుకుని తాగుతున్నాం. పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా ఇబ్బందులే. ఈ రోజుకు ఏ ఒక్క నాయకుడు మా సమస్యను పట్టించుకోలేదు. ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా మమ్మల్ని తీసుకెళ్లి చూపించే వాళ్లు లేరు. వైద్య సౌకర్యాలు లేవు." -గ్రామంలోని మహిళలు
గ్రామం పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊరు మునిగిపోకుండా రక్షణ గోడ కట్టిస్తామని ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం అయిందని... తమ బాధలు వర్ణనాతీతమని చెబుతున్నారు.
"మూడు నెలల నుంచి వరద వచ్చినా మా సమస్యను ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. వరద వచ్చినప్పటి నుంచి పనులు కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం బియ్యం ఇచ్చినవాళ్లు కూడా లేరు. మాకు వేట తప్ప మరో పని తెలియదు. వరద వల్ల ఆ పని కూడా లేకుండా పోయింది. దిక్కు తోచని స్థితిలో బతుకుతున్నాం" -గ్రామస్థులు
స్థానికులతో కలిసి గ్రామాన్ని పరిశీలించిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్..వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే రక్షణగోడకు ప్రణాళికలు రూపొందించి నిర్మాణానికి పూనుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ఈనెల 20న అవనిగడ్డకు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నందున తమ సమస్యను ఆయనకు వివరించి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: