కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కృష్ణానది పాయ దాటుతున్నారు. అది దాటి పనులకు వెళ్లకపోతే వారికి పూట గడవదు. ఈ గ్రామం కృష్ణా కరకట్టకు నదివైపున ఉంటుంది. సుమారు 800 మంది నివాసముంటున్నారు. నదికి వరద వచ్చిన ప్రతిసారి వీరు ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తారు. వరద ఉద్ధృతిగా ఉన్నప్పుడు ఈ గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.
2019లో వచ్చిన వరదకు అక్కడ ఉన్న కాజ్ వే కొట్టుకుపోయింది. గత నెలలో అధికారులు సుమారు 9 లక్షల రూపాయలతో ఇసుక బస్తాలు, కంకర వేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే నెలరోజులు కాకముందే వరద నీటిలో అదీ కొట్టుకుపోయింది. నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అధికారులు రాకపోకల కోసం పడవలు ఏర్పాటు చేస్తారు. అయితే వరద తగ్గాక పడవలు ఉండవు. వారికేమో నది దాటి పనులకు వెళ్లకపోతే పూట గడవదు. అందుకే ప్రమాదమని తెలిసినా నడుములోతు నీటిలో ప్రయాణం చేస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వతంగా ఉండేలా వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి...