జుగుప్సాకరమైన వాతావరణం.. కాలనీలో నడవాలంటే ముక్కులు గట్టిగా మూసుకుని నడవాలి. తమనెవరూ చూడలేదు కదా అని బహిరంగంగా మూత్రవిసర్జన చేసేవారే అందుకు కారణం. విజయవాడలోని పాయకాపురం ఆంధ్రా బ్యాంక్ రహదారి. నిత్యం ఈ రోడ్డులో రాకపోకలు సాగించేవారి సంఖ్య ఎక్కువే. డ్వాక్రా సంఘాల పనుల మీద మహిళలూ చాలామంది ఇటువైపు నుంచే వస్తుంటారు. అయినా, కొందరు వ్యక్తులు సభ్యత మరిచి, ఈ దారి వెంట బహిరంగంగానే మూత్రవిసర్జన కానిచ్చేస్తుంటారు.
ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా పరిస్థితి మారలేదు. ఇక లాభం లేదనుకున్న స్థానికులు... దేవుడిపై భారం వేశారు. గోడలపై అన్ని మతాలకు చెందిన దేవుళ్ల చిత్రాలు, చిహ్నాల టైల్స్ అతికించారు. గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఇంగితం మరిచి ప్రవర్తించిన వారంతా... ఇప్పుడు బుద్ధిగా మసలుకుంటున్నారు. ఫలితంగా స్థానికులతో పాటు.. బ్యాంకుకు వచ్చేవారికీ దుర్వాసన బాధ తప్పింది.
ఆ పక్కనే ఉన్న మరో రహదారిలోనూ ఇలాంటి ఇబ్బందే ఉంది. అయితే అది ముఖ్యదారి అయినందున... స్థానికులు ఏమీ చేయలేకపోతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని... పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు ఎన్ని వచ్చినా... పరిశుభ్రత పాటించాలన్న కనీస భావన అందరిలోనూ ఉండాలని... స్థానికులు అంటున్నారు.