కృష్ణా జిల్లాలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనజీవనం స్తంభించగా....యాచకులు, నిరాశ్రయులు, అభాగ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరిలో చాలా మందిని విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు నిరాశ్రయుల వసతి గృహాలకు తరలించగా....కొంత మంది రోజు కూలీలు, యాచకులు అక్కడక్కడా తారసపడుతూనే ఉన్నారు. వీళ్లంతా తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు పలు స్వచ్ఛంద, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆహారం పంపిణీ చేస్తున్నాయి.
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కొంతమంది నిస్వార్థంగా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించి సేవ చేస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ ఆపత్కాలాన్ని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు. అనాధలు, నిరాశ్రయులకు ఆహారం అందించే పేరుతో రోడ్లపై ఇష్టారీతిగా తిరగడమే కాకుండా... సామాజిక దూరాన్ని సైతం పాటించకుండా భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. వీరిలో చాలా మంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు సరికదా.. గుంపులు గుంపులుగా వచ్చి ఇచ్చామా వెళ్లామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
విజయవాడ నడిబొడ్డుగా చెప్పుకునే బెంజిసర్కిల్ వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షాత్తూ పోలీసులే ఇలాంటి వారి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నా....ఇలా ప్రచారమే పరమావధిగా కనీస జాగ్రత్తలు పాటించకుండా పంపిణీ పేరుతో రోడ్లపైకి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రెండు జాతీయ రహదారులు కలిసే బెంజి సర్కిల్ కూడలి వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు....యాచకులు, నిరాశ్రయులు ఎక్కువగా తారసపడుతుంటారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఒకవైపు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తుండగా.. మరోవైపు ఇలా భోజనాలు, ఆహారం ప్యాకెట్లు, మజ్జిగ, మంచినీళ్ల పంపిణీ పేరుతో చాలా మంది రోడ్లపై తిరగడం, ప్రచారం చేసుకోవడాన్ని పోలీసులు ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి చర్యలను ఇకపై సహించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: