ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము... చదువులమ్మ చెట్టు నీడలో... అని ఓ సినీ కవి వర్ణించినట్టు... వారంతా 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఆ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు. చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయిన వారు... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తాము చదువుకున్న ఆ సరస్వతి నిలయంలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, హత్తుకుంటూ చిన్నపిల్లలైపోయారు. ఈ క్షణం మళ్లీ రాదంటూ మనసారా ఆస్వాదించారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గాంధీజీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభమై 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 1969 నుంచి 2019 వరకు ఇక్కడ చదువుకున్నవారంతా పూర్వవిద్యార్థుల సమ్మేళనం పేరుతో ఒక్కటై స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల వ్యవస్థాపకులు బొప్పా రామారావు విగ్రహాన్ని తొలి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణా రావు ఆవిష్కరించారు. మొదటి నుంచి ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. స్వర్గస్తులైన గురువులను స్మరించుకున్నారు.
కుటుంబసభ్యులతో హాజరైన పూర్వవిద్యార్థులు తాము కూర్చున్న తరగతి గదులను చూపిస్తూ... ఆనాటి జ్ఞాపకాలను వారితో పంచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అంతా కలిసి రోజంతా ఉల్లాసంగా గడిపారు. అనంతరం భోజనాలు చేస్తూ ముచ్చట్లలో మునిగిపోయారు. ప్రయోజకులను చేసేందుకు విలువలతో కూడిన విద్యా, జీవిత సత్యాలు నేర్పేవారమని రామకృష్ణారావు తెలిపారు. పెళ్లిళ్లై, పిల్లలు, కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా... చదువుకున్న పాఠశాలకు వస్తే చిన్నపిల్లలైపోతామంటున్న వీరి ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు.
ఇవీ చూడండి: 1971లో అద్భుత అవకాశం వదులుకున్నారు: మోదీ