ఎగువ నుంచి ఉరకలేసుకుంటూ కృష్ణమ్మ తరలి వస్తోంది. ఈ నీరు బ్యారేజీ వద్దకు భారీగా చేరుతోంది. ఈ పరిస్థితులతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ కిందికి ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ తరుణంలో పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలుపుదల చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రకాశం బ్యారేజ్ గేట్లు తెరిచేలా నీటి పరవళ్లు ఉంటాయని తొలుత అంచనా వేశారు. కానీ ఇంకా నీరు బ్యారేజీ వద్దకు ఎక్కువ పరిమాణంలో చేరుకోలేదు. ఇన్‌ఫ్లో సామర్థ్యం దృష్ట్యా కొంతసేపటి క్రితం బ్యారేజీ 70 గేట్లను జలవనరులశాఖ అధికారులు తెరిచారు.
అధికారుల అప్రమత్తం
జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, సంయుక్త కలెక్టరు మాధవీలత ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతంలోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులకు సెలవులను రద్దు చేశారు. నదీ తీరం వెంబడి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయటంతోపాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చటంతో పరివాహక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.