గతకాలపు గుర్తులను భవిష్యత్ తరాలకు అందించే ఏకైక మార్గం చారిత్రక ఆనవాళ్లు మాత్రమే. వేల ఏళ్లనాటి జీవన విధానాన్ని సైతం కళ్లకు కట్టినట్లు చూపడంలో శాసనాలు, శిల్పాలు ఎంతో దోహదపడతాయి. అలాంటి ఎంతో విలువైన చారిత్రక సంపద అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగువుతోంది. మౌర్యచక్రవర్తి అశోకుడు బౌద్ధమతం ప్రచారం కోసం క్రీస్తు పూర్వం 249 సంవత్సరంలో బుద్ధుని ధాతువులను ఘంటసాల, నాగార్జునకొండ, అమరావతిలలో నిక్షిప్తం చేశాడని చరిత్ర. అలా నిక్షిప్తం చేసిన ధాతువులున్న ప్రదేశంలో స్తూపాకారంగా నిర్మించి ఆ ప్రదేశంలోనే బౌద్ధ మతస్థుల ఆరామాలు ఏర్పరిచారు. అదే కృష్ణా జిల్లా ఘంటసాలలో ఏర్పాటు చేసిన బౌద్ధారామం. ఇలాంటి నిర్మాణం దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే కావడం విశేషం. క్రీస్తు శకారంభంలో నుంచి ఘంటసాల ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న కట్టడాలు వేల ఏళ్లనాటి శాసనాలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పాలరాతి శిల్పాలు, బౌద్ధ మతస్థులు ఎంతో పరమ పవిత్రంగా భావించే బుద్ధుడి అస్థికలతో నిర్మించిన ప్రదక్షణ స్తూపం చుట్టూ నీరు చేరి శిథిలావస్థకు చేరింది. ఎంతోమంది బౌద్ధ బిక్షువులు వివిధ దేశాల నుంచి ఇక్కడి వచ్చి ప్రదక్షిణలు, పూజలు చేస్తారు. అంతటి చరిత్ర గల ఆనవాళ్లు అధికారుల నిర్లక్ష్యంతో మరుగున పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో ఫలితం లేదంటున్నారు. అధికారులు దృష్టి సారించి బౌద్ధ సంపదను కాపాడాలని చరిత్రకారులు కోరుతున్నారు. మ్యూజియంలో బయట ఉన్న శిలలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచదవండి.