అది మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి రోజూ రోగులు వస్తుంటారు. వారికి సహాయకంగా వచ్చేవారు నిరీక్షించేందుకు భవనం లేక ఆవరణలోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వ హయాంలో మాజీ రాజ్యసభ సభ్యులు సినీనటుడు చిరంజీవి కేటాయించిన నిధుల నుంచి రూ. 20 లక్షలతో భవనం నిర్మించారు. విశాలమైన గదులు.. మరుగుదొడ్లు.. టైల్స్‌తో సుందరంగా తీర్చిదిద్దిన ప్రాంగణం, ఫ్యాన్లు, దీపాలు, తాగునీరు లాంటి సదుపాయాలు కల్పించారు. నిర్మాణం పూర్తయ్యి ఏడాది దాటిపోయినా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రోగుల సహాయార్థులు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కాసేపు సేదతీరేందుకు నిలువ నీడ లేకుండా పోతోంది.
రోగితోపాటు వచ్చిన వారు భోజనం చేసేందుకు సరైన స్థలం లేకపోవడంతో ఓపీ విభాగం వద్ద మెట్లపైన, చెట్ల కింద, మాతా శిశు విభాగంలోని వరండాల్లో నేలపైనే కూర్చొని తింటున్నారు. రాత్రి వేళల్లో ఈ సహాయకులు నిద్రించేందుకు సరైన వసతి లేకపోవడంతో పురుషులతోపాటు మహిళలు కూడా ఆరు బయటే నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. బాలింతలకు సహాయకులుగా వచ్చే వారికి కూడా స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సరైన సదుపాయాలు లేవు.
ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం
విశ్రాంతి భవనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. కరోనా కారణంగా జనసమూహాలు గుమిగూడి ఉండకూడదు.. అందుకే ప్రారంభించలేదు. త్వరలోనే భవనాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. - డాక్టర్ మాధవి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంటు
ఇదీ చదవండి :