వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువు ముళ్ల పొదల్లో కనిపించింది. ఆకలేసి గుక్కపట్టి ఏడుస్తుండటంతో అటుగా వెళ్తున్న వారు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ముళ్లపొదల్లో నవజాత ఆడ శిశువును వదిలేసిన ఘటన బుధవారం పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకమ్మగుంటలో చోటుచేసుకుంది. ఐసీడీఎస్ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని పొదల్లో నుంచి శిశువు ఏడుపు వినిపించడాన్ని అటుగా వెళ్తున్న గమనించారు. విషయాన్ని అంగన్‌వాడీ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు తమ శాఖ ఉన్నతాధికారులకు, స్థానిక మహిళా పోలీసుకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులతో కలిసి శిశువుని అక్కడి నుంచి తీసుకెళ్లి స్నానం చేయించి పాలు పట్టించారు. పామర్రు ఎస్సై పండు దొర సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో శిశువు జన్మించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పామర్రు సీడీపీఓ వి.భానుశ్రీ చిన్నారిని మచిలీపట్నం చిల్డ్రన్ హోంకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శిశువును ఎవరు వదిలేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోబోయిన సిబ్బందిపై.. పెట్రోల్‌తో దాడి!